ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందనే ఆరోపణలతో పలువురిని సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసారు. ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం పైన విచారణ సాగుతోంది. తాజాగా హైకోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేసారు. లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను చేర్చారు సిట్ అధికారులు. ఇటీవల అరెస్ట్ అయిన కేసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్యాల రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో పేర్కొన్నారు. ఇప్పటికే.. తమకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని నిన్న సోమవారం ఈ ముగ్గురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కానీ, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే ఈ కేసును చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది రెండు రోజుల క్రితం కోరారు. అప్పటి వరకు కూడా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఈ ముగ్గురు హైకోర్టును అభ్యర్థించారు.
వీరి అభ్యర్ధనను కోర్టు నిరాకరించింది. దీంతో ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వీరికి నిరాశే ఎదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో పాటు ఈ కేసులో జోక్యం చేసుకుందుకు కూడా నిరాకరించింది సుప్రీం ధర్మాసనం. దీంతో ఈ ముగ్గురు పేర్లను ఈ కేసులో చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. కోర్టు ఈ మెమోను పరిగణలోకి తీసుకుంటే ఈ ముగ్గురిని ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులుగా చేర్చేందుకు మార్గం సుగమం అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos