ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా మోపుతున్న పన్నులు ప్రజల నెత్తిన భారీ గుదిబండగా మారాయి. పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ పన్నుల భారంతో చిన్నపాటి ఇళ్లు, నివాసాలను నిర్వహించుకోలేక... అట్లాగని వాటిని అమ్ముకునేందుకు ఇష్టపడక... ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆస్తిపన్ను భారం జాస్తిగా పెరుగుతుండటంతో వారి పరిస్థితి దారుణంగా తయారైంది. గత ప్రభుత్వాలు నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నును అయిదేళ్లకోసారి పెంచుతూ... పేద, మధ్యతరగతి వర్గాలపై పెద్దగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకునేవి. ఒకవేళ భారం మరీ ఎక్కువగా ఉందని భావిస్తే... అయిదేళ్లకు బదులుగా 10 లేదా 15 ఏళ్లకోసారి ఆస్తి పన్నులు సవరించేవి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ... గత మూడేళ్లుగా ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను పెంచుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తుల విలువలను పెంచినప్పుడల్లా పన్ను మొత్తం మళ్లీ పెరుగుతోంది. దీన్ని ఒకేసారి వర్తింపజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని... పెరిగిన దానికి సమానమయ్యే వరకు ఏటా 15శాతం చొప్పున విధిస్తోంది. అంటే పన్ను పోటును నిరంతర ప్రక్రియగా మార్చేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వార్షిక అద్దె విలువ - ఏఆర్వీ కి బదులుగా ఆస్తి మూలధన విలువ - సీవీ ఆధారంగా పన్ను పెంచే కొత్త విధానం తీసుకొచ్చింది. దీనికి మళ్లీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో లింకు పెట్టింది. ఆస్తుల విలువలను ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెంచాలని నిర్ణయించింది. ఇదికాస్త పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారంగా పరిణమించింది. జగన్ సర్కార్ ఏటా ఆస్తి పన్ను సవరిస్తుండటంతో గత మూడేళ్లలో పట్టణ స్థానిక సంస్థల ఆదాయం భారీగా పెరిగినా... ప్రజలకు కల్పించిన అదనపు మౌలిక సదుపాయాలైనా భారీ పెరిగాయా అంటే అదీ లేదు. పన్నుల రూపేణ భారీగా ఆదాయం సమకూరుతున్నా... ఆ స్థాయిలోనే పట్టణ స్థానిక సంస్థలు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాయా అంటే.. అదేం లేదు. నగర, పుర పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో అధికార వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వ్యక్తంచేస్తున్న ఆందోళనలు, ఆక్రందనలే ఇందుకు నిదర్శనం. కనీసం వీధుల్లో దీపాలు కూడా వేయించలేని దుస్థితిలో ఉన్నామంటూ డిసెంబర్ మొదటివారంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో మా వార్డులకు వచ్చి చూపించాలని నవంబరు 25న నిర్వహించిన కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఏకంగా అధికార పార్టీ మహిళా కార్పొరేటర్ అధికారులను నిలదీశారు. తన డివిజన్ లో అత్యంత అధ్వానంగా ఉన్న రహదారి ఫొటోని సైతం ఆమె సభలో చూపించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన పరంగా జగన్ ప్రభుత్వం ఏపాటి శ్రద్ధ చూపుతున్నదో... దీన్నిబట్టి అర్థం అవుతోంది. పట్టణ స్థానిక సంస్థల పర్సనల్ డిపాజిట్ - పీడీ ఖాతాలను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ – సీఎఫ్ఎంఎస్ కి అనుసంధానించారు. ఆయా ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుర, నగరపాలక, నగర పంచాయతీల ఖాతాల్లో ఏమో నిధులు కనిపిస్తాయి. అయితే వివిధ పనులకు సంబంధించిన బిల్లులు పెడితే వాటిలో అత్యవసరమైనవి తప్పితే మిగతా వాటిని ఆర్థికశాఖ పక్కన పెడుతోంది. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో పనులంటేనే గుత్తేదారులు హడలి పోతున్నారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడ, అనంతపురం నగరపాలక సంస్థల్లో పాత బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయడానికి గుత్తేదారులు టెండర్లు కూడా వేయడం లేదు. మరోవైపు ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే కొత్త విధానంతో నూతనంగా ఇళ్లను నిర్మించుకుంటున్న వారంతా బెంబేలెత్తుతున్నారు. వారికి పాత పన్ను విధానం లేదు కాబట్టి... ఏటా 15% పెంపుదల వర్తించదు. రిజిస్ట్రేషన్ల శాఖ విలువ ప్రకారం నిర్ణయించిన పూర్తి పన్నును ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందే. ఇళ్లు, భవనాల నిర్మాణ ప్రాంతం ఆధారంగా విధిస్తున్న ఆస్తి పన్ను రూ.వేలు, లక్షల్లో ఉండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రజలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అదేవిధంగా... ఇప్పటికే ఇళ్లు ఉన్న వారు ... దానిపై అదనపు అంతస్తు వేసుకున్నా, ఒక గది నిర్మించుకున్నా కొత్త విధానం ప్రకారమే ఆస్తిపన్నును మదింపు చేస్తున్నారు. అప్పటి నుంచి ఆ మొత్తం భవనానికి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ణయించిన పూర్తి పన్నునే వసూలు చేస్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వతీరుపై విసుగెత్తిన పేద, మధ్యతరగతి ప్రజలే కాకుండా అన్నివర్గాల ప్రజలూ... ఈ అరాచక పాలనను ఇంకా ఎంతకాలం భరించాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos