ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రం మొత్తాన్ని విచారంలో నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఇప్పుడు వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. మిగిలిన వారిలో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు. అలానే ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున.. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఈ ప్రమాదంపై దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు. గాయపడిన, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ అధికారులు అన్ని విధాలుగా సహాయం అందించాలని ఆదేశించారు. మరోవైపు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన.. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos