ప్రకాశం జిల్లా పొదిలి ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారని కేసులు నమోదు అవుతున్నాయి. రాళ్లు, చెప్పులతో దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అక్కడ జరిగిన పరిణామాలు... పెడుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే తాను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లినట్టు జగన్ చెప్పుకొచ్చారు. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. ఓ నలభై మందిని అక్కడకు పంపించి గలాటా చేద్దామని చూశారన్నారు. "చంద్రబాబుగారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా... రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు." అని వైఎస్ జగన్ ఆరోపించారు.
టీడీపీ నేతలను అక్కడ పెట్టి 40 వేల మందిని రెచ్చగొట్టే పని చేశారని ఆరోపించారు జగన్. కానీ అక్కడికి వచ్చిన ప్రజలంతా సంయమనం పాటించారని గుర్తు చేశారు. లేకుంటే ఆ 40 మందికి ఏం జరిగేదో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ప్రజలు, రైతులు టీడీపీ నేతల పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? " టీడీపీ కార్యకర్తలను పంపించి రాళ్లు వేయించడమే కాకుండా తిరిగి ప్రజలపై కేసులు పెట్టడం ఏంటని జగన్ ప్రశ్నించారు. తన పర్యటనకు వచ్చిన రైతులు, ప్రజలను రౌడీలుగా చిత్రీకరించడం ఏంటని నిలదీశారు."ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ? రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది." అని జగన్ మండిపడ్డారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos