అమరావతి/గుంటూరు : రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతుకు భరోసా కల్పించి, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకురావడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం గుంటూరులో లాంఫాం నందు గల ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్నిపొలంలో ఎద్దుల అరక దున్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయానికి తొలి పండుగ అయిన ఏరువాకను గుంటూరులో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని, రైతాంగానికి గుంటూరు జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 66 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందువల్ల వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండేళ్లలో గాడిలో పెట్టగలిగాం. రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అనుసంధానం వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతు ఆదాయం పెంచడమే ఏన్డీయే కూటమి ప్రభుత్వ సంకల్పం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.7,500 ఇవ్వడం మినహా రైతుకు ఉపయోగపడే అనేక పథకాలను నిలిపివేశారని, విత్తన కంపెనీలకు వందల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి విత్తన సరఫరా వ్యవస్థను దెబ్బతీశారని అన్నారు. గత ప్రభుత్వ బకాయిలను దశలవారీగా చెల్లించి, రాయితీపై రైతులకు నాణ్యమైన విత్తనాలను సబ్సీడీపై అందిస్తున్నామని చెప్పారు. రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని ఒకే పంటను అధికంగా సాగు చేస్తే మరుసటి ఏడాది ధరలు పడిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిర్చి, పొగాకు వంటి పంటల విషయంలో గత అనుభవాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అధిక కెమికల్స్ ఉపయోగించడం వలన ఇటీవల చైనాకు వెళ్లిన గుంటూరు మిర్చి కంటైనర్స్ తిరిగి వెనక్కి వచ్చిన సందర్భాలు గర్తుచేసుకోవాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ కూడా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు.
ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలను అమలు చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పంటల నిర్వహణ సూచనలు గ్రామ స్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఎలాంటి వాతావరణ సవాళ్లు ఎదురైనా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి, శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే ప్రాంతాల వారీగా ఎరువుల సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టిందని, కేవలం 20 రోజుల్లోనే ఈ యాప్ ద్వారా 15 లక్షలకు పైగా ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. ఈ సేవలను మూడు లక్షలకుపైగా కౌలు రైతులు వినియోగించుకోవడం ఆనందదాయకమన్నారు. భూమి ఆరోగ్యం కాపాడాలంటే సమతుల్య ఎరువుల వినియోగం తప్పనిసరని, మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ద్వారా దిగుబడులు, నాణ్యత రెండూ మెరుగుపడతాయని మంత్రి సూచించారు. ఆధునిక సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాడిపరిశ్రమను కూడా రైతులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వర్జీనియా పొగాకు ధరల అంశంపై టోబాకో బోర్డు, వ్యాపారులతో చర్చించామని, రైతులకు నష్టం కలగకుండా కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. 2026–27 పంట సంవత్సరానికి మార్కెట్ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ డిమాండ్, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో (FCV - Flue Cured Virginia) వర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని సుమారు 81 మిలియన్ కిలోలకు నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యానవన పంటలకు దేశ, విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. గత ఏడాడి హెచ్‌డీ బర్లీ పొగాకు రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వం ముందుకు వచ్చి ₹273 కోట్ల సాయాన్ని రైతులకు అందించిందని గుర్తుచేశారు.
గత ఏడాది లానే తోతాపూరు మామిడి రైతులకు కేజీకి 4 రూ ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన హమీ ప్రకారం ఏడాదికి మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ నిధులను ఇచ్చామని, ఈ ఏడాది కూడా తొలి విడతగా నగదును రైతుల ఖాతాల్లో వేసామని గుర్తుచేశారు. 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.588 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గత వైసీపీ ప్రభత్వంలో ఐదేళ్లు రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ప్రజలను అప్పుల భారంలో ముంచిన జగన్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు విలువ ఆధారిత పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్ర వ్యవసాయం మరింత బలోపేతం అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతులకు చేస్తున్న సంక్షేమాలను చూసి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ కు మైండ్ పనిచేయడం లేదని, ఎలాగైనా కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తూన్నాడని మండిపడ్డారు. అమరావతిలో తిరిగే నైతిక అర్హత వైసీపీ నాయకులకు ఎక్కడుంది? ఐదేళ్లు రాజధానిని నిర్వీర్యం చేసి, రైతుల త్యాగాలను అవమానపరిచిన వారే ఇప్పుడు అమరావతిలో పర్యటిస్తామని చెప్పడం విడ్డూరం. ఇంటికి రావొద్దని ఎవరైనా స్పష్టంగా చెబితే, సిగ్గు ఉన్నవాళ్లు మళ్లీ ఆ ఇంటి గడప తొక్కరు. కానీ వైసీపీ నేతలు మాత్రం సిగ్గు, శరం లేకుండా మళ్లీ అమరావతికి వస్తామని చెప్పడం ప్రజలను అవమానపరచడమే. అమరావతి పాకిస్థాన్‌లో ఉందా? ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు తెలియలేదా? రాజధానిని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుని, ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడటం ప్రజలను మోసం చేయడమే. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఒక్కరోజైనా మనుషుల్లా గౌరవించారా? వారి కన్నీళ్లు, ఆవేదన, త్యాగాలను పట్టించుకున్నారా? పార్లమెంట్‌లో సైతం అమరావతికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడని వారు ఇప్పుడు రైతుల ప్రేమ కోసం వస్తున్నట్లు నటించడం హాస్యాస్పదం. అమరావతి రైతుల ఓపికకు, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు. ప్రజల ఆగ్రహానికి వైసీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, ఎమ్మెల్యేలు ధూళ్లిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, యూనివర్సీటి వీసీ సత్యన్నారయణ, వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నా
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos