బాపట్ల జిల్లాలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కొలుసు పార్థసారథి పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకి మద్దతుగా వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ... గుంటూరు జిల్లా నుంచి ఆలపాటిని పట్టభద్రులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలో లేనప్పుడే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విద్యావంతులు ఓట్లు వేసి గెలిపించారని గుర్తు చేశారు. విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏడు నెలల కాలంలో చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు మంత్రి గొట్టిపాటి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణ, చెల్లింపుల్లో గత ప్రభుత్వం రైతులను ఎంతగానో ఇబ్బంది పెట్టిందని, వైసీపీ ప్రభుత్వం రైతులకు పెండింగ్ పెట్టిన రూ.1,674 కోట్లను కూటమి సర్కార్ చెల్లించిందన్నారు. పింఛన్లు, ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని పేర్కొన్నారు. పోలవరం రాజధాని అమరావతి నిర్మాణాలను వేగవంతం చేశామని చెప్పారు. 33 వేల ఎకరాలిచ్చిన రైతుల్ని అవమానించడమే కాకుండా.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు జగన్ అన్యాయం చేశారని విమర్శించారు. ఒక్క అవకాశానికే రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను దేవుడు కూడా కాపాడలేడని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos