మరో తుఫాను ముంచుకొస్తోంది. మొంథా తుఫాను ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాను విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 24వ తేదీకల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
తుఫాన్ ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తుఫాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సూచించిన 'సెన్‌యార్'గా నామకరణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని మోడళ్లు, కోస్తా, రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్లు అంచనా వేశాయి.
కాగా, ఈ నెల 28వ తేదీన దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాలు, 29న నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ కాకినాడ - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఉత్తరాది నుంచి వీచే చలిగాలులు ప్రభావం చూపుతాయని, అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాల్లోని చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos