సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో మూడు రోజుల పండుగ రాబోతుంది. ఈ పండుగకు అందాల అరకు రారమ్మని పిలుస్తోంది. అరకులో మూడు రోజుల పాటు జరగనున్న అరకు ఉత్సవాలు ఆకట్టుకోనున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అరకు ఉత్సవాలు అక్కడి సంస్కృతిని తెలియజేసేలా ఘనంగా జరిగాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం అరకు ఉత్సవాలను నిర్వహించలేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటంతో అరకు ఉత్సవాలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ అరకు ఉత్సవ్ ;లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు ప్రదర్శనలు నిర్వహిస్తారు. సంప్రదాయ గిరిజన నృత్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటారు.
జనవరి 31వ తేదీ నుండి మూడు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, జిల్లా పర్యాటక మండలి చైర్మన్ అయిన ఏఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు. అరకు ఉత్సవాలే కాదు, ఫిబ్రవరి 23, 24, 25 తేదీలలో మారేడుమిల్లి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అరకు ఉత్సవ్‌లో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్, సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, ఆటలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సవర, కొమ్ము బూర, కోయ నృత్య ప్రదర్శనలతో పాటు స్ట్రీట్ డ్యాన్స్ లు ఆకట్టుకుంటాయి.
కాగా అరకు, బొర్రాగుహలను ప్లాస్టిక్ ఫ్రీ డెస్టినేషన్ గా ప్రకటించామని, అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో చిన్న సైజు నుండి రెండు లీటర్ల వరకు గల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను నిషేదించామని కలెక్టర్ స్పష్టం చేసారు. ఆయా ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇదిలా ఉండగా అరకు, మారేడుమిల్లి ఉత్సవాల నిర్వహణకు మూడేసి కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని ఆయన వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos