వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 10 నుండి 19వ తేదీ వరకు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. ఈ 10 రోజుల పాటు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున దీనికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ పరిణామాల మధ్య రాజధాని అమరావతి పరిధిలో వెంకటపాలెంలో నిర్మితమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు సందర్శించి... రోజువారి వివరాల గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
2019లో వెంకటపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2022 జూన్ 9వ తేదీన ఈ ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తయింది. అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ఆలయం శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. తాజాగా- ఈఓ శ్యామలరావు ఈ ఆలయాన్ని సందర్శించి... ఆలయానికి సంబంధించి నిలిచిపోయిన అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. ఇక్కడ పని చేస్తున్న టీటీడీ సిబ్బందికి అవసరమైన నివాస వసతి సముదాయాలు, అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండటానికి వీలుగా నిర్మించాల్సిన గదులు, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈ సందర్భంగా శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఈఓ శ్యామలరావు.. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను సూచించారు. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. మొత్తానికి ఇక రాజధాని అమరావతి లోనూ తిరుమల శ్రీవారి నామం ప్రతిధ్వనిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos