తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తొక్కిసలాట ఘటన పట్ల తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ... వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక టోకెన్ కౌంటర్ వద్ద భక్తులకు భద్రతను కల్పించదానికి చాలినంత మంది పోలీసులను విధి నిర్వహణలో మోహరింపజేశామని, టీటీడీ, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని వివరించారు. అయితే తొక్కిసలాట చోటు చేసుకున్న కౌంటర్ వద్ద గేట్ తెరిచే విషయంలో మిస్ కమ్యూనికేషన్ ఏర్పడిందని కలెక్టర్ చెప్పారు. సాయంత్రం 7:45 నిమిషాలకు భక్తుల్లో ఒకరు అనారోగ్యానికి గురికావడం వల్ల ఆసుపత్రికి తరలించడానికి గేట్ తెరవాల్సి వచ్చిందని, ఆ వెంటనే దాన్ని మూసివేశామని పేర్కొన్నారు.
పలితంగా- టోకెన్లను జారీ చేయడానికి గేట్ తెరిచారని భక్తులు భావించి.. వాళ్లందరూ కూడా గేట్ వైపు దూసుకొచ్చారని చెప్పారు. దీనితో గేట్‌ను తెరవాల్సి వచ్చిందని కలెక్టర్ వివరించారు. రాత్రి 9:15-9:30 గంటలకు పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చిందని, అర్ధరాత్రి 12:30 నుంచి ఒంటిగంట వరకు టికెట్ల జారీ కొనసాగిందని అన్నారు. గాయపడ్డ వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు. తొక్కిసలాటలో గాయపడిన ఘటనలో అయిదుమంది మరణించారని, ఒకరు అనారోగ్య కారణంతో చనిపోయినట్లు చెప్పారు. తమిళనాడులోని సేలం నుంచి వచ్చిన భక్తురాలు అనారోగ్యంతో మరణించారని అన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ముగ్గురు, నర్సీపట్నం, తమిళనాడులోని పొల్లాచ్చికి చెందిన ఒకరు తొక్కిసలాటలో మృతిచెందినట్లు ఆయన వెల్లడించారు.
భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ముందుగా ప్రకటించిన సమయం కంటే ఎనిమిది గంటల ముందే టోకెన్లు జారీకి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. క్షతగాత్రుల్లో 32 మంది రుయా ఆస్పత్రిలో, 14 మంది స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న భక్తులను టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు పరామర్శించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమతమైన ఉన్నతాధికారులు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos