సంచలనం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటన పైన విచారణ పూర్తయింది. వైకుంఠ ద్వార దర్శ నం టోకెన్ల కేటాయింపులో భాగంగా జనవరి 8న తిరుపతి బైరాగి పట్టెడ లోని పద్మావతిపార్కులో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. 44మంది గాయపడ్డారు. ఈ ఘటన పైన ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. పలువురిని విచారణ చేసిన కమీషన్ కీలక సమాచారం రాబట్టింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్దం అయినట్లు సమాచారం. దీంతో, ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
తిరుపతి తొక్కిసలాట పైన ప్రభుత్వం నియిమించిన ఏకసభ్య న్యాయకమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి దాదాపు 200 పేజీలతో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. దేవుడి దర్శనం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవటం పైన రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికంగా అధికారుల పైన చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ డిమాండ్ మేరకు టీటీడీ పాలక వర్గం పరిహారం చెల్లించటంతో పాటుగా క్షమాపణలు చెప్పింది. రాజకీయంగానూ ఈ ఘటన పైన విమర్శలు వెల్లువెత్తాయి. టీటీడీలో ఉన్నత స్థానంలో ఉన్నవారి మధ్య సమన్వయ లోపం పైన చర్చ జరిగింది. కాగా, మొత్తం ఘటన పైన బాధితులను కమీషన్ విచారించింది. పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యులను గుర్తించినట్లు చెబుతున్నారు. కాగా, తాజాగా విచారణ కమీషన్ నివేదిక కసరత్తులో నిమగ్నమైనట్లు సమాచారం. జస్టిస్ సత్యనారాయణమూర్తి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విచారణకు సంబంధించి.. భవిష్యత్తులో టీటీడీ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై నివేదిక రూపకల్పనకు కసరత్తు చేసినట్లు సమాచారం.
పద్మావతి పార్కు వద్ద తొక్కిసలాట ఘటన గురించి కీలకమైన వీడియోలు కూడా కమిషన్‌కు అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు అధికారులు జస్టిస్ సత్యనారాయణమూర్తి చాంబర్ వద్దకు రాగా వీరిని కలవడానికి ఆయన ఇష్టపడలేదని సమాచారం. అక్కడి సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిద్దరూ వెళ్లిపోయారు. ఇక, నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తరువాత.. బాధ్యుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos