భూమండలాన్ని భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించాలనే లక్ష్యంతో ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ డేను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 22న శనివారం అంటే ఇవాళ ఎర్త్ అవర్ డేను పాటించనున్నారు. శనివారం రాత్రి 8.30 PM గంటల నుంచి 9.30 PM గంటల వరకు ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేయనున్నారు. గంట పాటు లైట్లను ఆర్పేస్తే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది నిపుణుల అభిప్రాయం.

అందుకే ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ డేను పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8:30 PM నుంచి 9:30 PM వరకు ప్రజలందరూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి ఎర్త్ అవర్ డేను పాటించాలని కోరారు. 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' సంస్థ ఆధ్వర్యంలో పాటిస్తున్న ఎర్త్ అవర్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములై భావితరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంతో సాయపడదామని తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపు నిచ్చారు. ఇవాళ గంటపాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని సీఎం చంద్రబాబు చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పులకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇదిలాఉండగా.. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతీ ఏడాది ఎర్త్ అవర్ డే ను ప్రపంచ దేశాలు పాటిస్తూ వస్తున్నాయి.

Related Videos