ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతోపాటు పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ముందుగా విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చివరిగా తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos