ఏపీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో పలువురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాశీబుగ్గలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. కార్తీకమాసం కావడం వల్ల ఈ తెల్లవారు జాము నుంచి భక్తులు పోటెత్తారని, సరైన చర్యలు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన సంభవించిందని తెలుస్తోంది. ఏకాదశి కావడంతో వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన రెయిలింగ్ ఊడిపోవడంతో ఒక్కసారిగా జనం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసిందని అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సీఎం చంద్రబాబు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తోందన్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తో మాట్లాడామని పేర్కొన్నారు. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించామని వెల్లడించారు.
తొక్కిసలాట ఘటనపై రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలోనే ఉన్న అచ్చెన్నాయుడు వెంటనే కాశీబుగ్గ బయల్దేరి వెళ్లారు. ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని, గాయపడిన వాళ్లకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు తరలించినట్టు వెల్లడించారు.
కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన గురించి దేవాదాయ శాఖ ఉన్నత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే జిల్లా మంత్రి అచ్చం నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడిన వివరాలు అడిగి తెలుసుకున్నామని వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని మంత్రి ఆనం అదేశించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హుటాహుటిన శ్రీకాకుళం బయలుదేరిన వెళ్లారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos