వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో వందలాది గోవులు మృతి చెందాయని భూమన పలు ఫొటోలను షేర్ చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన టీటీడీ ఈవో... భూమన ఆరోపణలను ఖండించారు. అలాగే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గోశాలలో పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో కనీసం అధికారులను కూడా రానివ్వని వారు.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, గోవులు చనిపోయాయని ఆరోపణలపై సాక్షాధారాలతో రావాలని టీటీడీ చైర్మన్ సవాల్ విసిరారు. కాగా ఈ సవాళ్ పై వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలను అలర్ట్ చేశారు. గోశాల అంశంలో భూమన కరుణాకర్ రెడ్డికి పార్టీ నేతలు సపోర్ట్ గా నిలవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ తిరుమల గోశాల శాంతిర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ర్యాలీకి అనుమతి లేదని తిరుపతి పోలీసులు తెలిపారు. ర్యాలీగా వెళ్లవద్దని గన్ మెన్లతో మాత్రమే సందర్శించాలని భూమనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో.. ఈ రోజు అన్ని ఆధారాలతో ఉదయం 10 గంటలకు కచ్చితంగా గోశాలకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా తిరుమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే భూమనను హౌస్ అరెస్ట్ చేశారని పలువురు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై స్పందించిన పోలీసులు తాము ఎవరినీ హౌస్ అరెస్ట్ చేయలేదని తేల్చి చెప్పారు. దీంతో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక నగరం అయిన తిరుమల తిరుపతి లో ఎటు చూసిన టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ రోజు కూటమి నేతలు టీటీడీకి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించాలని పిలుపు నిచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos