ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. అభ్యర్థులెవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కింపు కొనసాగిస్తున్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 7,210 ఓట్లు రాగా.. ఏపీటీఎఫ్, కూటమి అభ్యర్థి రఘువర్మకు 6,835 ఓట్లు; పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరికి 5810 చొప్పున ఓట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు. 2.3శాతం ఓట్లు చెల్లనివిగా మిగిలాయి. ఈ ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ కొనసాగుతోంది.ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచారనే విషయం రాత్రి 8గంటలకు తెలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరుచేసిన తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. రౌండ్ల వారీగా చెల్లుబాటైన ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి రౌండ్‌లో 10,783 చెల్లుబాటైన ఓట్లు ఉండగా.. రెండో రౌండ్‌లో 13,929, మూడో రౌండ్‌లో 11,870, నాలుగో రౌండ్‌లో 13,377, ఐదో రౌండ్‌లో 13163, ఆరోరౌండ్‌లో 14783 చొప్పున చెల్లుబాటైన ఓట్లు ఉన్నాయి.
మరోవైపు, ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 371 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి. నియామవళికి విరుద్ధంగా ఉన్న 51 పోస్టల్ బ్యాలెట్లను అధికారులు చెల్లుబాటు కావని నిర్ధారించారు. గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 25 మంది అభ్యర్థులు ఉన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ బలపరచిన అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos