గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని నెలలుగా వంశీ అమెరికాలో ఉంటున్నారు. కాగా, హైదరాబాద్ లో రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, టీడీపీ కార్యాలయంపై కేసులో కాకుండా.. మరో కేసులో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. చంద్రబాబు కుటుంబసభ్యుల పైన వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కెసులో నిందితుడుగా వంశీ ఉన్నారు. కాగా, ఈ కేసులో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు.

ఇదే సమయంలో వంశీ పైన అక్రమంగా ఇసుక తవ్వకాల  కేసులు ఉన్నాయి. టీడీపీ ఆఫీసు పైన దాడి కేసులో హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని.. ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను వంశీ ప్రశ్నించారు. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కాదని.. మట్టి త్రవ్వకాల పైన కేసు ఉందని..అందులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్ ఏ కేసులో జరిగిందనేదీ మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు అక్కడ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. కాగా, ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ మధ్నాహ్నం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

కాగా, ఈ అరెస్ట్ వెనుక మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యాలయం పై దాడి కేసు ను తాజాగా సత్యవర్ధన్ వెనక్కు తీసుకున్నారు. సత్య వర్ధన్ గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నారు.  సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని వంశీతో పాటుగా మరో అయిదుగురుపై కేసు నమోదైంది. దీంతో, వంశీ తో సహా మరో ఐదుగురిపై నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా.. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే వంశీ పైన కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Related Videos