మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం కలిశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి సహా పలు కేసుల్లో ఐదు నెలలుగా జైలులో ఉన్న వంశీ.. జులై 2న బుధవారం అంటే నిన్న బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. జగన్‌ను ఆయన నివాసంలో కుటుంబంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన వంశీ.. జైలు జీవితం, ఇతర విషయాలపై అధినేతతో చర్చించినట్లు సమాచారం. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీని ఫిబ్రవరి 16న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయనపై పలు కేసులు పెట్టారు. మొత్తం 11 కేసులు నమోదు కావడంతో సుమారు 140 రోజులు జైలులో ఉన్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడితో పాటు నకిలీ ఇళ్ల పట్టాలు, భూముల కబ్జా వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసుల కారణంగా ఆయన రిమాండ్ ఖైదీగా గత ఐదు నెలల నుంచి విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. జైలులో ఉన్న సమయంలో వంశీ చాలాసార్లు అనారోగ్యం పాలయ్యారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. వల్లభనేని వంశీకి ఐదు నెలల జైలు జీవితంలో నెల క్రితం రెండు కేసుల్లో బెయిల్ వచ్చింది. తాజాగా నకిలీ పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వంశీపై ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో ఆయన విడుదలకు మార్గం సుగమం అయ్యింది.
విడుదలకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టడంతో వల్లభనేని వంశీ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. కానీ, ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు తమ వాదనలను వినకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు.
రూ.195 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని.. దీనికి సంబంధించి సీల్డ్ కవర్లో నివేదిక ఇస్తామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో నివేదిక ఇచ్చిన తర్వాతే ముందస్తు బెయిల్ అంశాన్ని పరిశీలీస్తామని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం విచారణను జులై 16కు వాయిదా వేసింది. దీంతో వల్లభనేని వంశీ విడుదలకు ఆటంకం తొలగిపోయింది. ఇక, జైలు నుంచి దాదాపు 5 నెలల అనంతరం విడుదలైన భర్తను చూసి... వంశీ భార్య పంకజశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos