రాజకీయ ప్రత్యర్థులపై నిత్యం తిట్ల దండకంతో విరుచుకుపడే నాయకుల్లో ఒకరైన వల్లభనేని వంశీ కొంతకాలంగా ఎక్కడా కనిపించడం లేదు... ఏమీ వినిపించడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ... ఆ తరువాత కొంతకాలానికి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి టీడీపీ ముఖ్య నాయకులను తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో ఎడపెడా తిట్టడంతో వంశీ బాగా పాపులర్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబం మీద కూడా తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా... వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు, సమన్వయకర్తల నియామకంతో హడావుడి జరుగుతున్న వేళ వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో ఉంటున్నా బయటకు మాత్రం పెద్దగా ఫోకస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాదాపు నాలుగు నెలలుగా వార్తల్లో కూడా వంశీ రాకపోవడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అసలు వంశీ... వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా అనే సందేహం కూడా పార్టీ క్యాడర్‌లో చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని గన్నవరంలో పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆ పార్టీలో నెలకొన్నపరిణామాలతో విసిగిపోయిన పార్థసారథి టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. వంశీని మరోసారి పోటీ చేయించే ఉద్దేశం ఉంటే పార్థసారథి పేరు ఎందుకు తెరపైకి వస్తుందనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో ఉంది. ఇప్పటివరకు వైసీపీ అధిష్టానం విడుదల చేసిన ఆరు జాబితాల్లో గన్నవరం నియోజక వర్గం లేదు. ఈ క్రమంలో గన్నవరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా వంశీ పోటీ చేస్తారా లేదా అనే దానిపై సందేహాలు కలుగుతున్నాయి. వంశీ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా... ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేకపోవడంతో దూరంగా ఉంటున్నారా అనేది తేలాల్సి ఉంది. ఎన్నికలపై వైసీపీ నుంచి స్పష్టమైన హామీ వస్తే చూద్దామనే ధోరణిలో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎనీ హౌ... వంశీ సన్నిహితులకు కూడా అందుబాటులోకి రాకపోవడం, రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో పోటీలో ఉన్నట్లా... లేనట్లా అనే సందేహం అందరిలో నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos