తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. విశాఖ - సికింద్రాబాద్, కాచిగూడ - యశ్వంత్ పూర్, విజయవాడ - చెన్నై, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లను ఆశించిన స్థాయిలో ఆక్యెపెన్సీ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక, ఏపీ నుంచి దూరపు ప్రాంతాలకు చేరుకునేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వితని పత్రాలు సమర్పించారు.
ఇదే సమయంలో ఏపీ నుంచి యూపీలోని అయోధ్య, వారణాసికి వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు కోరారు. దీని ద్వారా ఏపీ నుంచి రెగ్యులర్ రైళ్లల్లో అయోధ్య, వారణాసి వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో, వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్లాలెక్కిన తరువాత విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కేటాయింపు పైన తొలి రెండు విడతల్లోనే ప్రకటన ఉంటుందని కూటమి ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఇక, వచ్చే నెలలో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లను సైతం ప్రకటిస్తున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందేభారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు వరంగానే భావించవచ్చని పర్యాటకులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos