ఆంధ్రప్రదేశ్ మీదుగా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మరికొన్ని కొత్త వందేభారత్ రైళ్ల కోసం ఏపీకి చెందిన ఎంపీలు రైల్వేమంత్రిని రిక్వెస్ట్ చేయగా ... ఆయన దీనిపై స్పందిస్తూ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని చెప్పారు. తాజాగా కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్లు తెరపైకి వచ్చాయి. నరసాపురం వారణాసిల మధ్య కొత్త రైలు వచ్చే అవకాశం ఉంది. నరసాపురం – సికింద్రాబాద్‌ల మధ్య వందేభారత్ రైలు ప్రతిపాదనలో ఉందని, త్వరలో భీమవరం – చెన్నైల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకొస్తామని ధీమాను వ్యక్తం చేశారు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.
నరసాపురం-మచిలీపట్నం మధ్య తలపెట్టిన కొత్త రైలు మార్గం పనులకు సంబంధించి డీపీఆర్ సిద్ధమైందని, వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాగే నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ జాప్యానికి ప్రధానంగా నిధులు, భూ సేకరణ కారణమని, గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటాలో ఐదేళ్లలో రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో విడుదలయ్యే నిధులతో ఈ పనులు మరింత వేగవంతం అవుతాయని ఆయన అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వందేభారత్ రైళ్లు నడపాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా కలిసి రిక్వెస్ట్ చేశారు. విజయవాడ నుంచి బెంగళూరు, విశాఖపట్నం నుంచి చెన్నైకు వందేభారత్ రైళ్లను నడపాలని కోరారు. ఈ మేరకు రైల్వేశాఖ కూడా ఆలోచన చేస్తోంది.
అంతేకాదు వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ఏపీలో నడిపే అవకాశం ఉందంటున్నారు. అలాగే రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలకు నిధులు, పనులు వేగవంతం చేయాలని రైల్వేమంత్రిని కోరారు. గత బడ్జెట్‌లో కొన్ని నిధులు కేటాయించగా.. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మరికొన్ని రైలు మార్గాలకు నిధులు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos