తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ వర్సిటీ వేదికగా ఇవాళ తొలి రోజు రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తెలుగు భాష కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, ప్రస్తుత జెట్ యుగంలో మన భాషను మనమే నిర్లక్ష్యం చేస్తున్నామని ఆవేదన చెందారు. తెలుగులో మాట్లాడని వారికి ఓటేయొద్దని, తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే సంబంధించినది కాదని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగాలని, సినిమా సంబషణలు తెలుగులో ఉండాలని అన్నారు. ఆంగ్లంలో మాట్లాడకపోతే నామోషీ అన్న భావన సరికాదని పేర్కొన్నారు.
అమ్మ భాషను మరిచిపోతే అమ్మను కూడా మరిచిపోయినట్టేనని వెంకయ్య నాయుడు అన్నారు. ఇంగ్లిష్ భాష వాడుతూ తెలుగు భాషను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు మాట్లాడుతున్నారని, మన భాషను మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, అండమాన్ నికోబార్ దీవుల్లో అద్భుతంగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారని వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్టీఆర్, నార్ల వెంకటేశ్వరరావు, రామోజీరావు తెలుగు భాషకి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇంగ్లీషులో 2 లక్షల పదాలు ఉంటే తెలుగులో 6 లక్షల పదాలు ఉన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. అమ్మ భాషను మరవద్దని వెంకయ్య పిలుపునిచ్చారు.
పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ వ్యవస్థలను మూసివేయాలని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు అన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమమే ఉండాలని, డిగ్రీ వరకు ప్రథమ భాషగా తెలుగు ఉండాలని ఆయన అన్నారు. 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి స్వీకరించాలని కోరారని గరికపాటి తెలిపారు. వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే ఆ పదవిలో ఎవరూ అవసరం లేదని సీఎం చంద్రబాబుకు చెప్పానని తెలిపారు.
తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వాలు తలుచుకుంటే పెద్ద కష్టం కాదని మరో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. చైనా, సింగపూర్ వంటి దేశాల్లో మాతృభాషలోనే చదివి సాంకేతికతను ఉన్నత స్థాయిలో అందిపుచ్చుకుంటున్నారని మనవారు మాత్రం పరాయి భాషలో చదువుతున్నారని అన్నారు. మన బిడ్డలు వేరే దేశాల్లో చదివి ఎక్కడెక్కడో బతుకుతున్నారని జొన్నవిత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికలు తెలుగు భాషా వృద్దికి మరింతగా కృషి చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న వివిధ తెలుగు మాండలికాల్లో వార్తా చానళ్ల యాంకర్లు వార్తలు చదవాలని కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos