వైసీపీ అధిష్టానం వైఖరి పట్ల అలకతో ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ విజయసాయి రెడ్డి గంటకు పైగా ఏకాంతంగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో అర్థాంతరంగా నిలిచిపోయిన వైసీపీ కార్యాలయ పనులు ఫునః ప్రారంభించేందుకు గాను సూచనలివ్వడానికి విజయసాయిరెడ్డి శ్రీకాకుళం వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా అందులో ఏమాత్రం వాస్తవం లేదని అర్థమవుతోంది. నిజంగా పార్టీ కార్యాలయ పనుల మీదే వచ్చి ఉంటే ముందు ఆ పని చూసుకుని ఆ తరువాత ఆ పక్కనే ఉన్న ధర్మాన ఇంటికి వెళ్లి ఉండేవారు.
జిల్లాలో పార్టీ నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకోక ముందే ధర్మాన ఇంటికి విజయసాయిరెడ్డి నేరుగా వెళ్లి ఏకాంతంగా గంటకుపైగా చర్చించారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డితోపాటు విశాఖపట్నం నుంచి వచ్చిన చిన్న శ్రీను, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ బయట విజిటర్స్ హాల్లోనే ఉండిపోయారు. గంటకుపైగా మాట్లాడిన తరువాత ధర్మాన బయటకు వచ్చినా తన మౌనాన్ని వీడలేదు.
ఏకాంతంగా జరిపిన చర్చలో గడిచిన ఐదేళ్లలో పార్టీ చేసిన తప్పిదాలు, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలిని చర్చించుకున్నారని తెలుస్తోంది. దీనిపై అటు ధర్మాన శిబిరం నుంచి కానీ, ఇటు విజయసాయిరెడ్డి వర్గం నుంచి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ తరువాత కాసేపు విజిటర్స్ హాల్లో అందరితో కలివిడిగా విజయసాయిరెడ్డి మాట్లాడినా ధర్మాన పెద్దగా జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని కేవలం ఒక్కసారి మాత్రమే కలిశారు. ఆ తరువాత రెండుసార్లు జిల్లా నేతలతో జగన్ సమావేశమైనా ఆ కార్యక్రమానికి ధర్మాన వెళ్లలేదు.
తొలుత తన మీటింగులకు ధర్మాన ప్రసాదరావు రాకపోవడానికి సీరియస్‌గా పరిగణించని జగన్మోహనరెడ్డి ... ఆ తర్వాత ఈ విషయంపై దృష్టి సారించి విజయసాయిరెడ్డిని రాయబారిగా పంపినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు మళ్లీ స్వీకరించిన తరువాత శ్రీకాకుళంలో తొలి అడుగే ధర్మాన ఇంట్లో పెట్టారు. జగన్మోహనరెడ్డి వ్యవహారశైలి మారితే రెండున్నరేళ్ల తరువాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో ధర్మాన ప్రసాద రావు ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు వస్తే గానీ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఊపందుకోవన్న రిపోర్టు జగన్మోహనరెడ్డికి క్రిష్ణదాస్ ఇచ్చారని సమాచారం. ఈ మేరకు ధర్మాన అలక ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని విజయసాయిరెడ్డి వచ్చినట్లు కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నపుడు జగన్ ... ధర్మాన ప్రసాదరావుతోపాటు అనేకమంది సీనియర్ నాయకులను పట్టించుకోలేదన్న ఆరోపణ ఉంది. అనేక అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పుడు 2027లో జమిలి ఎన్నికలు వస్తాయన్న కారణంతో నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న కారణంతో రాయబేరాలు సాగించినట్లు తెలుస్తోంది. ధర్మానకు డిమాండ్లు ఏమీ లేవని... జగన్మోహనరెడ్డి మైండ్ సెట్ మారితే చాలంటున్నారు ధర్మాన అనుచరులు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos