ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత, ఈ కేసు కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, మళ్లీ విచారణ స్పీడ్ పెంచనున్నారు. నిన్న శుక్రవారం కడ జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్ కేంద్రంగా జరిగిన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వివేకా హత్య జరిగిన చాలా కాలం గడిచినా, ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై కొన్ని కీలక సూచనలు చేసింది. దీంతో సీబీఐ అధికాలు మళ్లీ తమ పనిని మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో అధికారులు విచారణ చేపట్టారు. రెండేళ్ల తర్వాత అధికారులు ఇంత వేగంగా కదలడం చూస్తుంటే కేసులో కీలకమైన ఆధారాలు లభించాయేమో అన్న అనుమానం కలుగుతుంది. ఈ కేసులో గతంలో కొందరు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల వైపు సీబీఐ దృష్టి పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారి సోదరులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, భరత్ కుమార్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్‌కు నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు విచారణకు రావాలని ఆదేశించగా శుక్రవారం ఉదయమే మహేంద్ర యాదవ్ పులివెందుల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మరోవైపు కిరణ్ యాదవ్ కూడా అధికారుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విచారణలో అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఒక వాట్సాప్ కాల్. వివేకా హత్య జరిగిన తెల్లవారుజామున 1.42 గంటల సమయంలో కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి ఒక కాల్ వెళ్లినట్టు సీబీఐ గుర్తించింది. అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి ఒక వాట్సాప్ కాల్ చేసారు. సాధారణంగా అందరూ నిద్రపోయే ఆ సమయంలో అది కూడా హత్య జరిగిన రోజే ఇంత అర్థరాత్రి కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. వారిద్ధరి మధ్య ఏం చర్చ జరిగిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కేవలం సాధారణ కాల్ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అని లోతుగా విచారిస్తున్నారు.
నిజానికి వీరిద్దరిని సీబీఐ అధికారులు ఈ నెల 20న హైదరాబాద్‌లో ప్రాథమికంగా విచారించారు. అక్కడ వచ్చిన సమాచారం అధారంగా, మరిన్ని వివరాలు సేకరించేందుకు ఇప్పుడు నేరుగా పులివెందులలలో విచారణ జరుపుతున్నారు. గతంలో దొరికిన కాల్ డేటాను ఇప్పుడు వీరు చెబుతున్న సమాచారాన్ని అధికారులు సరిపోల్చి చూస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చిందా లేక క్లైమాక్స్‌కు చేరుకుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని రాష్ట్రవ్యాప్తంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos