ఉత్తరాంధ్ర ప్రజల కల రైల్వేజోన్ సాకారం కాబోతోంది. డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రైల్వేజోన్ కు అవసరమైన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం చివరి రోజు వరకూ ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే స్థలం రెడీ చేసింది. వివాదాలు లేకుండా ముడిసర్లోవలో 52 ఎకరాలను రైల్వేకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ త్వరలో రైల్వేజోన్ ఏర్పాటవుతుందని ప్రకటించారు.
2018లో అప్పటి కేంద్ర కేబినెట్ రైల్వేజోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇక రైల్వే జోన్ పనులు వేగవంతం అయ్యే క్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ గెలుపొంది అధికారంలోకి వచ్చినా ఒక్కటంటే ఒక్క సారి కూడా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అడగలేదు. ఐదేళ్ల పాటు స్థలం కూడా రైల్వేకు అప్పగించకుండా తాత్సారం చేశారు. అడిగి మరీ రైల్వేజోన్ పెట్టాల్సిన అవసరం ఏముందిలే అని కేంద్రం కూడా లైట్ తీసుకుంది. ఆ తర్వాత 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ కు కావాల్సిన స్థలంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రెడీ కావడంతో కేంద్రానికి జోన్ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఫాలో అప్ చేశారు. మరో ఏడాదిలో రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకటి, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకుని రైల్వే జోన్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే వాల్తేరు డివిజన్ ను కూడా విశాఖ రైల్వే జోన్ లో నే కొనసాగించడం. ఇప్పటి వరకూ విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదని ప్లాన్ రెడీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్‌లో ఉన్నాయి. వాటితో కొత్త డివిజన్ కూడా అలాగే ఉంచనున్నారు. మొత్తం జోన్ పై మరో నెలలో స్పష్టత వస్తుంది. మొత్తానికి ఢిల్లీలో నిన్న జరిగిన మోదీ - చంద్రబాబు చర్చలను బట్టి డిసెంబర్‌లో భూమిపూజ జరగడం ఖాయమని తెలుస్తోంది.
మరోవైపు విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన కు గాను ప్రధాని వస్తున్న సమయంలోనే మరో అంశం చర్చకు కారణం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. తాజాగా కాంట్రాక్టు కార్మికుల అంశంలో తాత్కాలిక ఒప్పందం జరిగింది. అయితే, ప్లాంట్ కు నిధుల కేటాయింపు పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశం పైన తాజాగా కార్మిక సంఘాల నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ ను కలిసారు. కేంద్రంతో చర్చిస్తామని పవన్ హామీ ఇచ్చారు. డిసెంబర్ లో ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పైన ఈ లోగానే స్పష్టత ఇస్తారా..ప్రధాని విశాఖకు రానున్న సమయంలో క్లారిటీ ఇచ్చేలా చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos