"మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీకి చెందిన 164 మంది కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. ఆనాడే మేము భయపడలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన మీ బెదిరింపులకు భయపడతామా?" అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలోకి వచ్చినా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన పర్యటనలంటేనే ప్రజల ప్రాణాలు తీయడమని ఘాటుగా విమర్శించారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్‌లో టీడీపీ పట్టణ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా మనుషుల్ని చంపుకుంటూ వెళుతున్నారు, పల్నాడు జిల్లా పర్యటనలో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి ముగ్గురిని చంపారు. ఒకరిని కారు కింద పడేసి చంపారు. రెండో వ్యక్తి ఊపిరాడక చనిపోయారు. మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరుక్కుపోయారు.
జనసమీకరణ మనం చేయలేక కాదు.. మనవల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. కార్యకర్త కారు కిందపడితే కనీసం దిగి చూడలేదు. కార్యకర్తను రోడ్డున పక్కన పడేసి వెళ్లిపోయారు. దిగి చూసి ఆసుపత్రికి పంపించి ఉంటే బతికేవాడు. బాధిత కుటుంబం తల్లిని తీసుకువచ్చి కనీసం కూర్చోపెట్టలేదు. గ్లాస్ మంచినీరు అయినా ఇచ్చారా? సొంత కార్యకర్త చనిపోతే నిల్చొని రెండు భుజాలు తట్టి వెళ్లిపోయారు. వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బ్లేడ్ బ్యాచ్ ను, గంజాయి బ్యాచ్ ను ప్రోత్సహిస్తున్నారు. మీ తండ్రి హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారు. అప్పుడే భయపడలేదు, మీ రప్పా, రప్పాకు భయపడతామా? ప్రతిపక్షంలో ఉండగా బాబు గారి ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. వీరు మాట్లాడతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉంది. తిరగమంటే మనుషులను చంపుతున్నారు. నిబంధనలు పాటించమంటే ఎదురుదాడి చేస్తున్నారు. చిన్నసందులో వెళ్తా, మరో ముగ్గురుని చంపుతా అంటున్నారు.
ఇక... టీడీపీ కార్యకర్తలు గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... "పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా. కొన్ని నిర్ణయాలు తప్పు కావచ్చు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. ఒక్కసారి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తలవంచి పనిచేస్తా. పార్టీ ఫస్ట్, కార్యకర్తలు పస్ట్. కార్యకర్తలు అలక మానుకోవాలి. మన సమస్యలు కలిసికట్టుగా కూర్చొని మనమే పరిష్కరించుకోవాలి..." అని హితవు పలికారు.
సమన్వయ సమావేశం అనంతరం దాదాపు 1500 మందిని మంత్రి నారా లోకేష్ కలిశారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కరించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతిఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos