ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు... కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా సీఎం తనిఖీ చేశారు. ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.
"పోలవరం పూర్తి కావాలి... నదులు అనుసంధానం చేయాలి... కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి... ఇది నా కల. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో ముంచేసింది... నిద్రలేని రాత్రులు గడిపా. అంతగా పోలవరం ప్రాజెక్టు నా మనస్సుకు దగ్గరగా ఉంది" అని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి అయ్యింటే... రూ.440 కోట్లతోనే నిర్మాణం జరిగేదని, ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2019లో ప్రభుత్వం మారిన తరువాత పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా కూడా నాటి ప్రభుత్వం దానిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుందని.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఆరేడేళ్లు జాప్యం అయిందన్నారు . జాప్యం కావడం వల్ల ఖర్చులు పెరిగాయని వివరించారు. అనంతరం డయాఫ్రం వాల్ నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్ల భారం పడిందని, వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.
పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేయగలిగామన్న సీఎం చంద్రబాబు కృష్ణా డెల్టాకు నీరు అందించగలిగామని తెలిపారు.. గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకువెళ్లామని.. అక్కడ నీటిని పొదుపు చేసి సీమకు కృష్ణా జలాలు వెళ్లేలా చేశామని వెల్లడించారు. దీని వల్ల రాయలసీమకు నీటిని తరలించడం సాధ్యమైందని, ఉద్యాన రంగం అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాయలసీమలో రిజర్వాయర్లు అన్నింటినీ నింపామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు అన్నీ పూర్తయ్యేలా చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం తేల్చి చెప్పారు
గత వైసీపీ హయాంలో కేవలం 2 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై వైసీపీ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. నేడు అదే పట్టిసీమ లేకుంటే రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని ఉద్ఝాటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos