ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది, బీజేపీ జనాభా విధానాన్ని కొనసాగిస్తోంది.. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపుగా మారుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని, నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టాలి. దేశమంటే అన్ని రాష్ట్రాల కలయిక. నియోజకవర్గాల పెంపుపై మన అభిప్రాయాలను పంచుకోవాలి.. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలి. నా అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నా... డీలిమిటేషన్ పై మనందరిని ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రత్యేక అభినందనలు అని రేవంత్ రెడ్డి అన్నారు.
1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేయగా .. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థికవృద్దిని సాధించాయి.. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయని రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు ఇస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనను మనం అంగీకరించం.. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి గొడ్డలి పెట్టు లాంటిదని, అసమగ్రమైన ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా కలిసికట్టుగా బీజేపీని అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధాని వాజ్‌పేయీ విధానాన్ని పాటించాలని, మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో మార్చవద్దని, సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని, పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేయాలని,. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలని, రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పునర్విభజన ప్రక్రియపై మా రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తాం... మేం మా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో మీ మీ రాష్ట్రాల్లోనూ అలానే చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణ భారతదేశ పౌరుల గళాన్ని బలంగా, ఐక్యంగా మొత్తం భారత దేశానికి వినిపిద్దాం. పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని,.. మన పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళదామనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దామని అన్నారు.. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఒక భారీ బహిరంగ సభను మేం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos