కరోనా విలయం తర్వాత చీమ చిటుక్కుమన్నా ప్రజలు వణికిపోతున్నారు. కొత్తగా ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ అనే మరో వ్యాధి వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ కొత్త రకం వ్యాధి హడలెత్తిస్తోంది..స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇప్పటిదాకా విజయనగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అయిదుగురు చనిపోవడం సహా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది.
నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతందంటున్నారు డాక్టర్లు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడి ... జ్వరం, వాంతులు,తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు రావటం ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు నిపుణులు. లాలాజలంతో మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.అలాగని ఈ ఇన్‌ఫెక్షన్ మనుషులలో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదంటున్నారు వైద్యులు. తేమ ఎక్కువగా వున్నచోట ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంప్, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు . నలుసు లాంటి నల్లే కదా అని లైట్‌గా తీసుకోవద్దని... సకాలంలో స్పందించకుంటే, సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు సహా కిడ్నీ సమస్యలు రావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు 6నుంచి 30శాతం ఉండే అవకాశం వుంది. స్క్రబ్ టైఫస్‌కి వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2శాతం లోపు తగ్గించొచ్చని అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు.. కానీ దాని ప్రభావం ప్రాణాల మీదికి తెస్తుంది. అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పన్లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. బీఅలర్ట్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos