మంచు కుటుంబంలో అగ్గి రాజుకుని.. అదికాస్త ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేశాయి.
అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్ లీగల్ సర్టిఫికెట్) చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య భూమా మౌనిక రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో దీనికి ప్రతిగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. మనోజ్, కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారాయన. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ను కాబట్టి మనోజ్, మౌనిక వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
కాగా తనకు భద్రత కల్పించాలంటూ మోహన్ బాబు రాసిన l లేఖపై తాజాగా మంచు మనోజ్ స్పందిస్తూ... తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదని, ఇది ఆత్మగౌరవానికి, భార్య పిల్లల భద్రతకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తనపై దాడి చేశారని, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పరస్పరం పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదులు చేసుకున్న క్రమంలో మంచు మనోజ్ కు షాక్ తగిలింది. మనోజ్ పైనా, ఆయన భార్య మౌనికపైన పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos