అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకున్న విషాదం మాటలకు అందలేనిది. భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 5 మంది అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఏపీ ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే.. కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఎప్పటిలాగే క్రాకర్స్ తయారు చేస్తున్నారు. ఆదివారం కావడంతో 16 మంది కార్మికులు పనిలోకి వచ్చారు. మరికాసేపట్లో భోజన విరామం తీసుకుందామని అనుకున్నారు. ఒక కార్మికుడు బాణసంచాకు ఉపయోగించే ముడి సరుకును దంచుతున్న క్రమంలో వేగం పెంచి, ఎక్కువ బలం ఉపయోగించి దంచడంతో అక్కడ అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యింది. అసలే పేలుడు స్వభావం ఉన్న పదార్థాలు కావడంతో వేడికి చిన్న నిప్పు రవ్వ ఏర్పడింది. అది మందుగుండు సామగ్రిపై పడటంతో గత కొన్నిరోజుల నుంచి తయారుచేస్తున్న పదార్ధాలపై పడటంతో మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
పేలుడు ధాటికి ఫైర్ వర్క్స్ రేకుల షెడ్డు, గోడలు ధ్వంసమయ్యాయి. షెడ్డు కింద, దాని చుట్టుపక్కల శిథిలాల కింద కార్మికులు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొందరి శరీర భాగాలు వేరయి అక్కడ భయానక వాతావరణం నెలకొంది. మొదట అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ లాంటిది పేలిపోయిందని స్థానికులు అనుకున్నారు. తీరా వెళ్లి చూస్తే జరగరాని ఘోరం జరిగిపోయింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 4 గంటలకుపైగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. కొందరు కార్మికులను విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించగా, మరో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos