ఆంధ్రప్రదేశ్‌లో అటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురంలో ప్రకటించారు. ఈ దసరా నుంచే ప్రతి ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తామని వెల్లడించారు. దీంతో అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది... ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందనే విషయంపై చర్చ మొదలైంది. అధికారులు కూడా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆటోలకు గిరాకీ లేక ఇబ్బంది పడుతున్నట్టు చాలా ప్రాంతాల్లో డ్రైవర్లు నిరసన చేపట్టారు. తమ గురించి కూడా ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటో డ్రైవర్ల డిమాండ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించిన ప్రభుత్వం వాహన మిత్ర అమలు ఈ దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. వాహనమిత్ర పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసిన వెంటనే రవాణా శాఖాధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సొంత క్యాబ్‌లు, ఆటోలు, మ్యాక్సీక్యాబ్‌లు ఉన్న వారి వివరాలు సేకరించారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఆటో డ్రైవర్లే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లందరికీ పథకాన్ని అమలు చేయాలని చూస్తే దాదాపు ఐదు వందల కోట్లు నిధులు అవసరం అవుతాయి. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను సిద్ధం చేశారు. ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే... సొంత వాహనం కలిగి డ్రైవింగ్ చేస్తున్న వాళ్లు మాత్రమే అర్హులు. ఒకటి కంటే ఎక్కువ ఆటోలు, క్యాబ్‌లు ఉన్నా సరే ఒకదానికి వర్తింపజేస్తారు. ఆటో యజమాని, డ్రైవర్ ఒకరే అయ్యి ఉన్న వాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వాహనం ఆర్సీ బుక్, లైసెన్స్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలను రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఎవరు అర్హులు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఏం కావాలనే విషయాలపై క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos