ఏపీ నుంచి కూటమి ప్రభుత్వం మరో రాజ్యసభ స్థానం దక్కించుకోనుంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ కానుంది. 29వ తేదీ నామినేషన్లకు చివరి గడువు. వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఏకగ్రీవంగానే ఎన్డీఏ సీటు గెలుచుకోనుంది. కాగా, కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్ధి ఎవరనే దానిపై చర్చ జరుగుతుండగా... రాజ్యసభ విషయంలో బీజేపీ మాత్రం పట్టు బిగించింది. ఏపీ విషయంలో తాము పట్టువిడుపులతో ఉంటామని.. పార్లమెంట్ అంశంలో మాత్రం తమ పార్టీకే ప్రాధాన్యత ఉండాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. తొలుత మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా.. చివరకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్ధనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేసారు.
అయితే, ఈ సీటు విషయంలో మూడు పార్టీల్లోనూ ఎవరికి వారు తమకే అనే అంచనాతో ఉన్నారు. కానీ, సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు, పవన్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి వస్తోంది. వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమి లో చేరారు. తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు. ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన సాయిరెడ్డి రాజీనామాతో అదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. కొత్త అభ్యర్ధి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. సీమ ప్రాంతానికే బీజేపీ ఈ సీటు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. బీసీ వర్గానికి చెందిన ఆర్ క్రిష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపినా.. తెలంగాణలో ఆయన సేవలు వినియోగించుకోనుంది.
ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో బీజేపీ నుంచి ముగ్గురి పేర్లు బలంగా ప్రచారంలో ఉన్నాయి. అందులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు తో పాటుగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో సాయిరెడ్డి సైతం బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ఆ పార్టీ నేతల సమాచారం. సాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు టీడీపీ నుంచి అభ్యంతరం వస్తుండటంతో ఆయన చేరిక ప్రక్రియ ఆలస్యం అయిందని చెబుతున్నారు. లిక్కర్ కేసులో సాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ కావడంతో ఈసారికి సాయిరెడ్డి ఛాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీటు బీజేపీకే ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఏపీ నేతలకే అవకాశం ఇస్తారా.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా అనూహ్యంగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos