ఏపీలో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరగ్గా... జగన్ ఒకసారి ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుకాలేదు. ఈ క్రమంలో ఈ నెల 11 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు అవుతారా ..లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో... ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఇటీవలి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని జగన్ మరోసారి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న ఆందోళనతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేనప్పడు అసెంబ్లీ సమావేశాలకు పోవడం ఏం ఉపయోగమని స్పష్టత అన్నారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని గొప్పగా చెబుతున్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మొదటి 2014 -19 కాలంలో కూడా అదే తప్పు చేశారు. పాదయాత్ర చేయడానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. కనీసం ఎమ్మెల్యేలను కూడా పంపలేదు. తాను లేకుండా ఎమ్మెల్యేలు వెళ్తే వారు ఎక్కడ బాగా మాట్లాడతారోనని.. జగన్ రెడ్డి కంటే ఈ లీడర్లే బెటర్ గా ఉన్నారని జనం అనుకుంటారేమోనని భయపడ్డారు. అందుకే ఎమ్మెల్యేలను కూడా పంపలేదు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు.
పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యా బలానికి తగ్గట్లుగా మాట్లాడే చాన్స్ వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ది ఒక్క పక్షం మాత్రమే కాబట్టి ఇంకా ఎక్కువే సమయం రావొచ్చు. సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఏ స్పీకర్ అయినా మైక్ ఇస్తారు. కానీ మైక్ ఇవ్వరని ముందే ఊహించుకుని తాము మీడియా ముందే మాట్లాడతామని ప్రకటించేసుకున్నారు జగన్ రెడ్డి. ఆయన ప్రకటన చూసిన తర్వాత చాలామంది ఇదేం సమర్థన.. కనీస ఆలోచన కూడా ఉండదా కామెంట్లు చేస్తున్నారు
ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిలో మొదటిది చట్టసభలకు వెళ్లడం. చట్టసభ సభ్యుడిగా ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే.. చట్టసభలకు వెళ్లి చట్టాలు చేసే ప్రక్రియలో పాలు పంచుకోవడానికి.. ప్రజా సమస్యలు లేవనెత్తడానికి. తమకేదో అక్కడ మైక్ ఇవ్వరని చెప్పి ఎగ్గొడితే అది ప్రజాద్రోహం అవుతుంది. అసలు అసెంబ్లీకే వెళ్లని వారికి ఇక ఎమ్మెల్యే పదవితో పనేముంటుంది. అందరూ రాజీనామాలు చేసి మీడియా ముందు మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుకోవడానికి ఎమ్మెల్యే పదవులు అవసరం లేదు కదా అనే విమర్శలు వస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును ఏ మాత్రం గౌరవించని నేతల వల్ల చట్టసభలకు ఎలాంటి సమస్యా రాదు.. కానీ వారి రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. మిగతా వైసీపీ ఎమ్మెల్యేలయినా దీన్ని గుర్తించి సభకు రావాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos