ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనుక వైసీపీ కుట్ర ఉందని, ఆ పార్టీ నేతలు పథకం ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రివర్స్ డ్రామాలకు పాల్పడుతున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అనంతర పరిణామాలపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఘాటుగా స్పందించారు.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, వారం రోజుల్లో అన్ని విషయాలు స్పష్టంగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై త్వరలోనే పూర్తి వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. లడ్డు వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు బయటికి రాకుండా ఆ పార్టీ నేతలు రివర్స్ నాటకాలు ఆడటం, ఈ క్రమంలోనే అంబటి సీఎం చంద్రబాబుపై తీవ్రంగా దూషించడం ఆక్షేపనీయమని అన్నారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు ను దూషించి, ఆ తరువాత “నేను అనలేదని మాట మార్చడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. అంబటి రాంబాబు పై “టీడీపీ కార్యకర్తలను నేను రెచ్చగొట్టానని చెబుతున్నారు… దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? నేను దాడి చేయాలనుకుంటే మీరు టీడీపీ కార్యాలయంపై చేసినట్టు చేయించలేనా?” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిలదీశారు. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ గారి భార్యను రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ప్రశ్నించారు. “ఈ ఘటనకు ఆమెకు ఏం సంబంధం? ఆమె ఎందుకు సమాధానం చెప్పాలని?” ఎమ్మెల్యే మాధవి ప్రశ్నించారు.
“వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఈ నెల 11న మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి. అక్కడే అన్ని అంశాలు తేల్చుకుందాం” అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. “మా ఎంపీని, నన్ను డమ్మీలు అన్నా భరించాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషిస్తే సహించేది లేదని, ఆ విషయంలో అంబటిని క్షమాపణ అడగడంలో తప్పేముంది?” అని ఎమ్మెల్యే మాధవి ప్రశ్నించారు. “మమ్మల్ని డమ్మీలు అన్నా స్పందించలేదు. మాపై ఎన్ని విమర్శలు చేసినా భరించాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిని తాకితే మాత్రం చూస్తూ ఊరుకోం” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు. “మాకు కక్ష రాజకీయాలు చేయడానికి టైమ్ లేదు. మా సమయం మొత్తం గుంటూరు అభివృద్ధికే కేటాయిస్తున్నాం” అని తెలిపారు. మీరు తప్పు మాట్లాడితే మళ్ళీ వస్తాం..ఇదే రిపీట్ అయితే మీ పరామర్శల కోసం మీ నాయకుడు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే మాధవి హెచ్చరించారు. శవాల దగ్గరకు వెళ్లడం కాదు... మీ జగనన్నను అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద తాట తీయమనండి అని ఆమె సవాల్ విసిరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos