ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా - గుంటూరు, తూర్పుగోదావరి - పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రకటించారు. పోలీసులను పెట్టి వైసీపీ నేతల్ని ఇష్టానుసారంగా అరెస్టులు చేయిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక సక్రమంగా జరిగే అవకాశం లేదని ... అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించామని ఆయన చెబుతున్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. పార్టీ నేతలను గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నమోదును చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. అయితే వైసీపీ తరపున అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో వారు తమ పార్టీ ఓటర్లను కూడా నమోదు చేయించలేకపోయారు.
ఇటీవల ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత వైసీపీ క్యాడర్ ఇంకా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో వారిని మరో ఎన్నికకు సమాయత్తం చేయడం కష్టమని ఆ పార్టీ అగ్ర నేతలు అనుకున్నారు. అదే సమయంలో విశాఖలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వచ్చినా.. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చట్ట విరుద్దమని హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆ ఎన్నిక జరగడంపై సందిగ్ధం ఏర్పడింది. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడును ఖరారు చేశారు. ఈ ఎన్నికపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos