మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. సరికొత్త రాజకీయ పంధాను అనుసరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఒక రకమైన నైరాశ్యం ఏర్పడటంతో పార్టీ నుంచి పదుల సంఖ్యలో బయటకు వెళ్లారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అలంకరించిన వారు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఉనికి సైతం ప్రమాదకర స్థితిలో ఉంది. కూటమి దెబ్బకు విలవిలలాడుతున్న వైసీపీకి.. ఇదే సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నుంచి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో జగన్ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు. పార్టీ పునరుద్ధరణపై ఫోకస్ పెట్టారు. తిరిగి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగానూ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించాలని, జిల్లాల్లోనే బస చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచే ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ గా షర్మిల నాయకత్వం పైన కాంగ్రెస్ లోనే కొంత మంది సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాలు.. అన్న జగన్ తో విభేదాల కారణంగా.. ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కాంగ్రెస్ ముఖ్యులతో మంత్రాంగం ప్రారంభించారు.
కాంగ్రెస్ లో తన తండ్రితో పని చేసి ప్రస్తుతం పార్టీలో పూర్తి స్థాయిలో కొనసాగలేని నేతలను తనతో కలిసి వచ్చేలా స్వయంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి శైలజానాధ్ కర్నూలు లో జగన్ ను కలిసారు. కర్నూలు లో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. ఈ క్రమంలో శైలజానాధ్ తో పాటుగా ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎన్డీఏలోకి వెళ్లలేని పలువురు నేతలు కాంగ్రెస్ లో షర్మిల నాయకత్వంలో కలిసి పని చేయలేక పోతున్నామని ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు స్పష్టం చేసారు. దీంతో, జగన్ వీరి రాకతో తన పార్టీని బలోపేతం చేసుకోవటంతో పాటుగా షర్మిల పదవికి చెక్ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos