ఏపీ రాజకీయాలు ఇప్పుడు సిద్ధాంతాల నుంచి పూర్తిగా మత విశ్వాసాల వైపు మళ్లుతున్నాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. రాష్ట్రంలో  హిందూ వర్సెస్ క్రిస్టియన్  అనే ధోరణిని రాజకీయ పార్టీలు బలంగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం తర్వాత అధికార కూటమి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హిందూ వ్యతిరేకి  అనే ముద్రను బలంగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. జగన్ తన వ్యక్తిగత విశ్వాసం ప్రకారం క్రైస్తవుడు కాబట్టి, ఆయనకు హిందూ ఆచారాలపై గౌరవం లేదనే వాదనను  కూటమి నేతలు వినిపిస్తున్నారు.

ఈ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ శైలిని మార్చుకుంటున్నారు. తాను కేవలం ఒక మతానికే పరిమితం కాదని, హిందూ ధర్మాన్ని కూడా అంతే గౌరవిస్తానని చాటిచెప్పేందుకు ఆలయ సందర్శనలను పెంచారు. పులివెందులలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనడం ఇందులో భాగమే. అయితే, ఈ క్రమంలో ఆయన కొన్ని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హోమగుండం వద్ద పూజారి ఇచ్చిన పదార్థాలను సరిగ్గా వేయకపోవడం, హిందూ పూజా విధానాల్లో తడబడటం వంటి అంశాలను కూటమి సోషల్ మీడియా విభాగాలు హైలైట్ చేస్తూ ఆయన ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. జగన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే సామాజిక వర్గాల్లో క్రైస్తవ మైనారిటీలు ప్రధానమైన వారు. జగన్ హిందూ ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో అతిగా హిందూ ఆచారాలను పాటిస్తే, తన సొంత కోర్ ఓటు బ్యాంకులో అసంతృప్తి మొదలయ్యే ప్రమాదం ఉంది. 'మత రాజకీయాలు మనకెందుకు ' అనే భావన అటు హిందువుల్లోనూ, ఇటు మైనారిటీల్లోనూ కలగకుండా చూసుకోవడం జగన్‌కు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది.

ఇప్పటికే సోదరి షర్మిల దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ సుప్రసిద్ధ మత ప్రచారకుడు. గతంలో జగన్ కోసం చర్చిలను ఏకం చేశారు. ఇప్పుడు వారు కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు.  కూటమి ప్రభుత్వం జగన్‌ను ఒక మతానికి మాత్రమే పరిమితం చేసి, హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని చూస్తోంది. దీనికి ప్రతిగా జగన్ సర్వమత సమభావన అనే ముసుగులో హిందూత్వ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ మతపరమైన పోలరైజేషన్  రాష్ట్రంలో రాజకీయాన్ని మార్చబోతోంది. భవిష్యత్తులో జగన్ మరిన్ని దేవాలయ పర్యటనలు చేసినా, కూటమి వేసే  మత ముద్ర  నుంచి ఆయన ఎంతవరకు బయటపడతారనేది సందేహమే. ఒకవైపు తనపై పడుతున్న క్రైస్తవ ముద్రను తుడిచేసుకోవడం, మరోవైపు తన సొంత ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా ఉండటం.. ఈ రెండు విభిన్న పార్శ్వాల మధ్య జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ మత పోరు రాబోయే ఎన్నికల నాటికి ఏ స్థాయికి చేరుతుందో మరి చూడాలి. 

Related Videos