తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రైళ్ల రాకపోకల క్రమబద్ధీకరణతో పాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు - బీబీనగర్, మహబూబ్ నగర్ - డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా 7 రైలు మార్గాలను 2 నుంచి 4 వరుసల వరకు విస్తరించనున్నారు. గుంటూరు-బీబీనగర్ సెక్షన్‌ను విస్తరించేందుకు రూ.3,238 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో చెన్నై - హైదరాబాద్ మధ్య 76 కిలోమీటర్లు, విజయవాడ - సికింద్రాబాద్ మధ్య 38 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
చెన్నై-విజయవాడ- హైదరాబాద్ మధ్య మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం గుంటూరు-విజయవాడ-కాజీపేట- సికింద్రాబాద్ మార్గం రద్దీగా మారడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు- సికింద్రాబాద్ లైన్ అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గం ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడుతుంది. జగ్గయ్యపేట, జన్‌పహాడ్‌లలో ఉన్న సిమెంట్ కర్మాగారాలకు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ధాన్యం మిల్లులకు మేలు జరుగుతుంది. 239 కి.మీ. ప్రాజెక్టులో 100 కి.మీ. ఏపీ పరిధిలోకి, 139 కి.మీ. తెలంగాణ పరిధిలోకి వస్తుంది. కృష్ణానదిపై 458 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు. మహారాష్ట్రలోని ముద్ఖేడ్ నుంచి తెలంగాణలోని మేడ్చల్ వరకు, అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్- ఏపీలోని డోన్ మార్గాన్ని రూ.5,655 కోట్లతో డబ్లింగ్ పనులు చేపడతారు. మహారాష్ట్రలో 49 కిలోమీటర్లు తెలంగాణలో 295 కిలోమీటర్లు, ఏపీలో 74 కిమీ డబ్లింగ్ చేయనున్నారు. ఈ పనులతో సికింద్రాబాద్-బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రోజూ కొత్తగా 50 రైళ్లు నడపడానికి వీలవుతుంది. భద్రక్-విజయనగరం సెక్షన్‌లోని ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్‌పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాలతో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో రైల్వే లైన్ పనులు జరగనున్నాయి. కాగా... దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్ ప్రస్తుత పరిస్థితి గురించి మాత్రం ఎలాంటి ఆశాజనకమైన వార్తా వెలువడలేదు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos