సాధారణంగా పాఠశాలల్లో చిన్నపిల్లలు చిన్నచిన్న విషయాలకే తగువు పడుతుంటారు. నా డ్రెస్ బాగుందంటే... కాదు నాదే బాగుందనో... నా బెంచ్ బాగుందంటే కాదు నాదే బాగుందనో .. ఇలా ప్రతి విషయానికీ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. వారు కావాలని అలా చేయరు... ఆ చిన్నవయసులో చైల్డిష్ మెంటాలిటీ అలా ఉంటది. కానీ వారే పెరిగి పెద్దయిన తరువాత... అదే ధోరణితో వ్యవహరిస్తే ఎబ్బెట్టుగానే కాదు... చుట్టుపక్కల వారు ఈసడించుకుంటారు కూడా. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే... తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. ఇప్పుడు ఈ మేనిఫెస్టోల విషయమే ఆయా పార్టీల నేతలు ... చిన్నపిల్లల్లాగానే గొడవ పడుతున్నారు. మేనిఫెస్టోలు ప్రకటించిన నేతలు... మేము ఎన్నికలు గెలిస్తే ... ఏం చేయగలమో వివరిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలు ఎదుటి వారి మేనిఫెస్టోలపై ఇష్టారీతిన విమర్శించుకుంటున్నారు. మీ మేనిఫెస్టో చిత్తు కాగితంలా ఉందని ఒక పార్టీ వారంటే... కాదు... మీరే మమ్మల్ని కాపీ కొట్టారంటూ మరొకరు గొడవ పడుతూ ఎలెక్షన్ సీన్ ను రక్తి కట్టిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ మా మేనిఫెస్టోను కాపీ కొట్టి గొప్పగా ప్రచారం చేసుకుంటోందంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించగా... వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ... కాంగ్రెస్ మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిదని తీసిపారేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాము ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టి కేసీఆర్ మేనిఫెస్టో తయారుచేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. తాము ప్రకటించిన హామీలే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నాయని విమర్శలు కురిపిస్తోంది. అటు బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోపై స్పందిస్తూ... కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదని, ఇప్పుడు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాయమాటలను ప్రజలు నమ్మవద్దని... బీఆర్ఎస్ మేనిఫెస్టో అంతా బోగస్ అని బీజేపీ దాడి చేస్తోంది. బీజేపీ ఇంకా తమ పార్టీ మేనిఫెస్టోను వెల్లడించలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం మేనిఫెస్టో రూపకల్పనపై బీజేపీ దృష్టి పెట్టింది. మరోవైపు... బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కితాబిచ్చారు. పేదల ప్రజల కోసం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, బీఆర్ఎస్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మరోసారి తెలిపారు. గత పదేళ్లలో పేదల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, వాటి వల్ల లక్షల మంది లబ్ధి పొందారని ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం అవుతారని, ఆయనను మరోసారి గెలిపించాలని... కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే అని ఒవైసీ అన్నారు. కాగా... అన్నిపార్టీల నేతలు ఎన్నికల ముందు ... అద్భుతమైన మేనిఫెస్టోలు ప్రకటించి అరచేతిలో వైకుంఠం చూపుతారని... తీరా అధికారం చేపట్టిన తరువాత వారి అసలు రంగు బయట పడుతుందని... ప్రజాసంక్షేమం మరిచి సొంత సంక్షేమానికి పరిమితమవుతారని పబ్లిక్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos