ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- రాజీనామాకు పూనుకున్నారు. తన పదవిని త్యజించి ప్రజా తీర్పును కోరనున్నారు. కొత్తగా ఎన్నికలకు వెళ్లనున్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే నేడు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనిపై చర్చించేందుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం 4:30 అపాయింట్ లభించింది. లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఆ సమయంలో ఆయన వెంట ఇద్దరు లేదా ముగ్గురు మంత్రివర్గ సహచరులు ఉంటారు.
ఆయన రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో- ఢిల్లీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. లెప్టినెంట్ గవర్నర్‌ను కలుసుకోవడానికి ముందే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. దీనికోసం ఈ మధ్యాహ్నం శాసన సభాపక్షం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో కేజ్రీవాల్, మంత్రులు ఆతిషి, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలందరూ పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అనంతరం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా, అరవింద్ కేజ్రీవాల్ వారసురాలిగా మంత్రి ఆతిషి మర్లెనా సింగ్‌కే అధిక అవకాశాలు ఉన్నాయి. ఈ రేసులో ఆమె ఫ్రంట్ రన్నర్‌గా నిలిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇప్పటికే ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ.. మంత్రులందరితోనూ ఒక్కొక్కరిగా సమావేశమైంది. వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos