ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యం ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు సహా సుమారు 200 మంది మావోయిస్టులు శుక్రవారం ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. బస్తర్‌లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సమక్షంలో ఈ చారిత్రాత్మక లొంగుబాటు కార్యక్రమం జరిగింది. కొన్నేళ్లుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పెనుసవాలుగా మారిన మావోయిస్టు ఉద్యమాన్ని ఈ ఘటన తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల కృషితోనే ఇది సాధ్యమైందని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచడంలో తాము సఫలమవుతున్నామని చెప్పడానికి ఈ భారీ లొంగుబాటే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కాగా హింసను వీడి వచ్చే మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం సత్ఫలితాలనిస్తోంది. ఈ విధానం కింద లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారు తిరిగి సమాజంలో గౌరవంగా బతికేందుకు అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తోంది. గత కొద్ది రోజులుగా మావోయిస్టుల లొంగుబాట్లు గణనీయంగా పెరిగాయి. కేవలం ఒక్క రోజు క్రితమే టాప్ కమాండర్ రూపేశ్‌తో సహా 170 మంది లొంగిపోయారు. అంతకుముందు, అక్టోబర్ 15న సుక్మా జిల్లాలో రూ.50 లక్షల సమష్టి బహుమతి ఉన్న 27 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించారు. గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 258 మంది లొంగిపోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఉద్యమంలోని అంతర్గత విభేదాలు, స్థానిక ప్రజల నుంచి మద్దతు కరువవడం వంటి కారణాలతో మావోయిస్టులు లొంగుబాటుకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos