కర్ణాటకలో ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ... త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే తరహా విజయం సాధిస్తామని ధీమాగా చెబుతోంది. ఇందులో భాగంగా ... తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లోనూ నేతల్లోనే కాకుండా... ప్రజల్లో కూడా మంచి ఊపు తెచ్చేందుకు ... పార్టీ చరిత్రలో తొలిసారి హైదరాబాద్ లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నగరంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దర్శనమిస్తున్న భారీ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.
సీడబ్ల్యూసీ అంటే అందరికీ తెలిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనే పదాలను వక్రీకరిస్తూ... కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.... కరప్ట్ వర్కింగ్ కమిటీ పేరుగా మార్చి ఈ పోస్టర్లను పలుచోట్ల ప్రదర్శించారు. ఈ పోస్టర్లలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సహా కీలక నేతల ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల కింద వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కామ్ ల వివరాలను సైతం ముద్రించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా మొత్తం 24 మంది సీడబ్ల్యూసీ సభ్యుల పేర్లు, ఫొటోలు ఉన్నాయి. ఫొటోల కింద బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ హెచ్చరికలను కూడా ముద్రించారు. ఈ హెచ్చరికల పక్కనే వైఎస్ఆర్ అన్న అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ పోస్టర్లను ఎవరు ముద్రించారు... గోడలపై అతికించింది ఎవరనే వివరాలు తెలియరాలేదు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనిల ఫొటోల కింద నేషనల్ హెరాల్డ్ స్కామ్, మన్మోహన్ సింగ్ ఫొటో కింద కోల్ స్కామ్, మీరా కుమార్ ఫొటో కింద ఎన్ హెచ్ఏ స్కామ్, దిగ్విజయ్ సింగ్ ఫొటో కింద రిక్రూట్ మెంట్ స్కామ్, చిదంబరం ఫొటో కింద ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కామ్ లలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వివరాలు ఉన్నాయి. మిగతా నేతల ఫొటోల కింద కూడా వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వినిపించిన స్కామ్ ల వివరాలను ముద్రించారు. ఈ పోస్టర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుండటమే కాకుండా... రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos