బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం నలంద జిల్లాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు మృతి చెందగా.. మరో డజనుకు పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నలంద జిల్లా బీహార్ షరీఫ్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఘ్పా గ్రామంలోని శీతలాష్టమి ఆలయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చైత్ప మాసం చివరి మంగళవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం సామర్థ్యానికి మించి జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. అధికారుల నిర్లక్ష్యం, కనీస ఏర్పాట్లు లేకపోవడమే ఈ పెను విషాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు.

దైవదర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఒకేసారి గర్భాలయం వైపు దూసుకురావడంతో తీవ్రమైన తోపులాట మొదలైంది. భారీ జనాన్ని నియంత్రించేందుకు అక్కడ తగినంత మంది పోలీసులు గానీ.. వాలంటీర్లు గానీ లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక, కాళ్ల కింద నలిగి 8 మంది మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆలయ ప్రాంగణం ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. స్పృహ కోల్పోయి నేలపై పడి ఉన్న మహిళలను కాపాడేందుకు తోటి భక్తులు శతవిధాలా ప్రయత్నిచారు. కొందరికి సీపీఆర్ చేసి ప్రాణం పోసే ప్రయత్నం చేయగా.. మరికొందరు స్పృహ తప్పిన వారి ముఖంపై నీళ్లు చల్లుతూ.. నోట్లో వేళ్లు పెట్టి శ్వాస ఆడుతుందో లేదో అని చూస్తూ విలపించడం అక్కడి భయానక పరిస్థితికి అద్ధం పట్టింది. ఈ తొక్కిసలాట ఘటనలో ప్రాణ భయంతో అరిచిన కేకలు అక్కడ ఉన్న వారి మనసులను కలిచివేస్తున్నాయి. ఘటన జరిగిన కొంతసేపటికి పోలీసులు, వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని వెంటనే బీహార్ షరీఫ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. భక్తుల భద్రత విషయంలో జరిగిన లోపాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : 31st CII Partnership Summit -2026| Regional Conference at IIM| Visakhapatnam |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos