గుజరాత్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది చనిపోగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి లండన్ లోని గ్యాట్‌విక్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సర్వీస్ టేకాఫ్ అయిన కాసేపటికే జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న వారిలో 11ఏ సీటులో ఉన్న ప్రయాణికుడు మినహా మిగతా ప్రయాణికులు, సిబ్బంది 241 మంది చనిపోయారని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో ధృవీకరించింది.
కాగా, ఎయిర్ ఇండియా మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద కూలిపోవడంతో అందులో ఉన్న మెడికోలు సైతం ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 నుంచి 25 మంది చనిపోయారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లంచ్ టైమ్ కావడంతో మధ్యాహ్నం మెస్‌కు మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు అంతా వచ్చారని తోటి మెడికోలు తెలిపారు. విమానం కూలడంతో బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. గాయపడిన వారిని 50 మంది హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. వీరిలో 25 మంది గాయపడిన వారి జాబితాను అధికారులు గురువారం రాత్రి విడుదల చేశారు.
విమానంలోని ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా, బ్రిటన్‌కు చెందిన 53 మంది, ఫ్రాన్స్‌కు చెందిన 7 మంది, కెనడాకు చెందిన ఒకరు ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం మా ఆలోచనలు, ప్రయత్నాలు చనిపోయిన వారి కుటుంబాల అవసరాలపై కేంద్రీకృతమై ఉన్నాయని పేర్కొంది. కాగా అదనపు సహకారం అందించడానికి ఎయిర్ ఇండియా నుండి సంరక్షకుల బృందం అహ్మదాబాద్‌కు వచ్చింది. ఈ సంఘటనపై దర్యాప్తు అధికారులకు ఎయిర్ ఇండియా పూర్తిగా సహకరిస్తుందని, మరింత సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక ప్రయాణీకుల హాట్‌లైన్ నంబర్ 1800 5691 444 ను ఏర్పాటు చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos