మహారాష్ట్ర రాజకీయ ధ్రువతార, సీనియర్ నేత అజిత్ పవార్ (66) అంత్యక్రియలు నేడు పూణే జిల్లాలోని ఆయన స్వస్థలం బారామతిలో అత్యంత విషాదభరిత వాతావరణంలో జరగనున్నాయి. నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్తను జీర్ణించుకోలేక యావత్ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు నేడు బారామతికి తరలివస్తున్నారు.
బుధవారం ఉదయం బారామతి ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టేబుల్‌టాప్ రన్‌వేకు కేవలం 200 మీటర్ల దూరంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ దివంగత నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అత్యున్నత స్థాయి నేతలు వస్తుండటంతో బారామతిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంతాప దినాలను ప్రకటించింది.
ఇదిలా ఉండగా విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్‌లోని వాయిస్ రికార్డర్‌లో నిక్షిప్తమైంది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. విమానాన్ని నియంత్రించడానికి పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ భీతిగొల్పే సమయంలో పైలట్ నోటి నుంచి 'ఓ.. షిట్' అనే ఆవేదనతో కూడిన మాటలు వినిపించాయి. ఆ మరుక్షణమే భారీ శబ్దంతో విమానం నేలకూలింది. ఈ మాటలు విమానం అదుపు తప్పిందని పైలట్లు ముందే గుర్తించారని సూచిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే చివరి నిమిషంలో విమానం అడ్డదిడ్డంగా ప్రయాణించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ వాయిస్ రికార్డింగ్‌లను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన పరిస్థితులను అంచనా వేస్తున్నారు. సాంకేతిక లోపమా? లేక వాతావరణ పరిస్థితుల వల్ల పైలట్లు నియంత్రణ కోల్పోయారా? అన్న కోణంలో లోతైన దర్యాప్తు సాగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos