జార్ఖండ్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ఇక్కడ పోలింగ్ ఆరంభం కానుంది. పోలింగ్ సవ్యంగా సాగడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వం వహిస్తున్నారు.

ఈ నెల 13, 20 తేదీల్లో అంటే రేపు, ఎల్లుండి రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు... ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 11.84 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 66.84 లక్షలు.

తొలి దశలో 43 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సహా మొత్తం 683 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి... తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 73 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తొలి విడతలో 15, 344 మంది పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ. ఈ విడతలో మొత్తం 1,36,85,508 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 68,65,207 మంది పురుషులు, 68,20,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ విడతలో మెజారిటీ సీట్లను దక్కించుకోవడానికి జేఎంఎం- కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ కూటమి పార్టీలు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని సాగించాయి.

Related Videos