ప్రతిపక్షాల కూటమి అయిన ‘ఇండియా’ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన విపక్షనేతలతో ఆర్థిక రాజధాని అయిన ముంబై కళకళలాడుతోంది. రెండురోజులపాటు విపక్ష కూటమి భేటీ అవుతున్న మూడోవిడత భేటీలో ప్రతిపక్ష నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాంటి నిర్ణయాలకైనా అందరూ సానుకూలంగా స్పందిస్తారేమోకానీ.. ఒక్క ప్రధాని అంశంపైనే ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏకమైన విపక్ష పార్టీలు.. ఆ దిశగా స్పీడ్ పెంచాయి.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అందుకోసమే ముంబయ్ లో మూడోవిడత భేటీ అయిన విపక్ష పార్టీలు ... రెండురోజుల పాటు విపులంగా చర్చించి... తమ కూటమి లోగో తో పాటు.. భవిష్యత్ కార్యాచరణ, అనుసరించిన వ్యూహాలపై ఓ నిర్ణయానికి వస్తాయని అంటున్నారు. 28 పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరుల్లో భేటీ అయ్యారు. మూడోసారి ముంబైలో ఉమ్మడి భేటీని నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముంబై భేటీలో పాల్గొన్నారు.

అదేవిధంగా... మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బిహార్, ఢిల్లీ, తమిళనాడు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, తో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇంతమంది రాజకీయ దురంధరలు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు.  ప్రధానంగా... ఇండియా కూటమి ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
దీనికోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. అత్యంత సీనియర్, దళిత నేత కావడం వల్ల ఖర్గేను ఉమ్మడి కూటమి ఛైర్మన్‌గా ఎన్నుకుంటారని తెలుస్తోంది. అత్యంత కీలకమైన కన్వీనర్ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మమతా బెనర్జీ, జనతా దళ్ యునైటెడ్ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లలో ఒకరిని ఎన్నుకుంటారని సమాచారం.

ఈ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కూటమిలో తీవ్ర పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు. మరోవైపు కన్వీనర్ పదవి రేసులో నితీష్ కుమార్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కన్వీనర్‌గా ఎన్నికైన నాయకుడినే ప్రధానమంత్రి అభ్యర్థిగానూ ప్రకటించవచ్చని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని సమర్థవంతంగా ఢీ కొట్టగలిగే సామర్థ్యం, అనుభవం, రాజకీయ చతురత నితీష్ కుమార్ ఒక్కడికే ఉందంటూ జేడీయూ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రధాని అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారు.. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుందా.. లేదా అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ అంశంపై ఈ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos