కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం అయిందని.. ఈ విషయంలో కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ చక్రం తిప్పారని ... ఇక అధిష్టానం అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. కానీ... తాజాగా షర్మిల తెలంగాణలో ధర్నా చేయడాన్ని బట్టి చూస్తే... కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడ్డాయా... అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వైఎస్ షర్మిల ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ.. అంగబలం, అనుకూల పరిస్థితులు ఆమెకు తెలంగాణలోనే లేవనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా ఆమె అడుగులు వేసినట్లు కనిపించారు. అయితే కాంగ్రెస్ ముందు ఆమె కొన్ని షరతులు పెట్టారు. అదేంటంటే ఒకటి పార్టీలో సముచిత స్థానం, ఉపాధ్యక్షురాలి స్థాయి పదవి ఇవ్వడం.. రెండోది తాను కోరుకున్న 10 చోట్ల ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలి.. మూడో విషయం ఏంటంటే.. లోక్ సభ లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఇలా మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలకు ఒక్క షరతు విధించింది. అదేటంటే... 10 సీట్లు ఏంటీ... మెుత్తం అసెంబ్లీ టికెట్స్ నువ్వు కోరుకున్న వాళ్లకే ఇద్దాం కానీ అది తెలంగాణలో కాదు ఏపీలో అని షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.
మరోవైపు ... షర్మిలకు తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర ఉంది. మరికొందరిలో రాజన్న బిడ్డ అనే సానుభూతి ఉంది. కానీ ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిలను ఆహ్వానించి ఆంధ్రులను ఆదరించే పార్టీగా ముద్ర వేసుకోడం సరికాదని ... పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తును బూచిగా చూపించిన సీఎం కేసీఆర్ ... ఈ సారి కూడా అదేవిధంగా షర్మిలను చూపిస్తే వచ్చే సీట్లు తగ్గుతాయని హైకమాండ్ భావిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిల రాకపోవడమే బెటర్ అనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పదే పదే హైకమాండ్ కు చెబుతున్నారు. మరోవైపు విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పడిపోయింది. దానికి ఊపిరిపోయాలంటే రాజశేఖర్ బిడ్డ షర్మిలనే కరెక్ట్ ఆప్షన్ అని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ కేడర్ అంతా రాజశేఖర్ వారసత్వం అంటూ వైసీపీలోకి చేరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ క్యాడర్ కాంగ్రెస్ వైపు రావాలంటే షర్మిలను ఏపీ కాంగ్రెస్ లో దించాల్సి ఉంటుందని నాయకత్వం భావిస్తోంది. అందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. షర్మిల ఇప్పుడు పార్టీలోకి వస్తే 2024 ఎన్నికల్లో పెద్దగా ప్రయోజనం లేకపోయినప్పటికీ.. 2029 ఎన్నికల్లో ఏపీలో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఎదుగుతుందని రాహుల్ గాంధీ యోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే... తెలంగాణలో పార్టీ నడుపుతూ ఇక్కడ దుకాణం బంద్ పెట్టి.. ఏపీకి ఎందుకు వెళ్లాలన్నది షర్మిల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. రెండు సీట్లు తక్కువగా ఇచ్చినా పర్లేదు ... తెలంగాణలోనే ఉంటానని ఆమె గట్టిగా చెబుతోంది. అందుకే ఢిల్లీలో పార్టీ విలీనంపై చర్చలు విఫలమయ్యాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చాక... కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా షర్మిల ధర్నా చేపట్టారు. అంటే తాను ఎక్కడికి వెళ్లేది లేదని... తెలంగాణలోనే ఉంటానన్న సంకేతాలు కాంగ్రెస్ హైకమాండ్ కు పంపినట్లు అయింది. దీంతో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడినట్లుగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మున్ముందు ఏంజరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos