బెంగళూరు నగరం మంగళవారం కురిసిన భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా, నగరానికి కీలకమైన హోసూరు రోడ్డు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీరు, గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు, నిస్సహాయంగా రోడ్లమీదే తమ కార్లను వదిలేసి వెళ్ళిపోతున్న ప్రయాణికులతో బెంగళూరు నరకప్రాయంగా మారింది. సాధారణంగా నిత్యం రద్దీగా ఉండే సిల్క్ బోర్డు నుండి రూపేన అగ్రహారం వరకు ఉన్న హోసూరు రోడ్డును పూర్తిగా మూసి వేశారు. అంతేకాదు, ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుందని భావించిన ఎత్తైన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా మూసివేశారు. "భారీ వర్షాల కారణంగా, హోసూరు రోడ్డు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ రెండూ తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించండి, హోసూరు రోడ్డుకు అసలు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు.
సెంట్రల్ సిల్క్ బోర్డు జంక్షన్ నుండి ఎలక్ట్రానిక్స్ సిటీ వరకు 9.9 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి దిగ్గజ కంపెనీల ఉద్యోగులకు ప్రాణధారం. కానీ, ఈ మార్గం కూడా మూతపడటంతో వేలాది మంది ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనితో ఎలక్ట్రానిక్స్ సిటీలోని విప్రో, టెక్ మహీంద్రా, సిమెన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థల వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మాడివాల సమీపంలోని అయ్యప్ప అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోయింది. దీనివల్ల హోసూరు రోడ్డుకు రెండు వైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇబ్బలూరు జంక్షన్, కస్తూరి నగర్, మైసూరు రోడ్డు టోల్‌గేట్ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఈ వర్షాల తీవ్రతను చూసి, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. "బెంగళూరులోని అన్ని కంపెనీలు, ముఖ్యంగా ఇన్ఫోసిస్ వంటివి, ఈ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. దీనివల్ల నగరంపై ఒత్తిడి తగ్గుతుందని, ఉద్యోగుల భద్రత కూడా పదిలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి, అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ సంఘటనలు బెంగళూరు పట్టణ ప్రణాళికలో వర్షపు నీటి నిర్వహణకు సంబంధించిన తీవ్రమైన లోపాలను స్పష్టం చేస్తున్నాయి. నిత్యం అభివృద్ధి చెందుతున్న బెంగళూరు వంటి నగరంలో ఇలాంటి వరదలు తరచుగా రావడం, ట్రాఫిక్ స్తంభించడం వంటివి నగర భవిష్యత్తుపైనే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos